Nithya Deva 6
100
నూరుపద్యములను నుడివితి భక్తిగ
చదువువారికీయ చలువ శ్రద్ద
దయగనీవుగాంచి తామసమునడచి
శుభమునీయితండ్రి శోభనాంగ
99
చరణ వందనములు చంద్రశేఖరునికి
పదసుమాంజలులివి పాదములకు
నయనదీపకునికి నమములు అజ్ఞాన
ధ్వంసునికి పదసుమదళములివియె
98
నిత్యదర్శనమ్మునిజముగ నాకిచ్చె
నాదుగురువుతానునందముగను
దర్శనమ్ముసర్వదారిద్ర్య దుఃఖహ
రణముసర్వభవహ రణము వరము
97
యిష్టములనుకష్ట నిష్ఠూరములను నే
నర్పనమునుసేతు నాగభూషు
పదములకడ ; శివుని పదపద్మములు సర్వ
తాపహరణములవి దయకుపేరు
96
కష్టములనుగూల్చ కాలభైరవుడుండు
నష్టములనుపూడ్చ నందివాహు
నిజమిదనిమరచుచు నిష్ఠూర బడనేను
మనసునందునెపుడు మదనవడను
95
నమమునీకుతండ్రి నాదుహృదయనాద
అనితర కృప కరుణ ఆత్మనిలయ
వందనమ్ము ప్రాణ వల్లభా శరణము
శాంత మూర్తి శరణు సాంబ సదయ
94
నిస్సహాయతలను నిజకోపతాపము
అర్పనమునుసేతు అభవునికడ
దుర్బలతను అన్ని దుర్బుద్ధులనునేను
అర్పనమునుసేతు అభవునికడ
94
లోనిశత్రువులను లోభమాత్సర్యము
లనుదునమవలెనిల అనుదినమ్ము
యుద్దములనుసేయు యోగికావలెనేను
విజయమొంద ధరన వినయముగను
92
చూడ దగును శివుని చోద్యము వడకుండ
ప్రతి అణువున మరియు ప్రతి క్షణమున
సర్వ కాల స్థితుడు సర్వేశ్వరుడు తానె
సర్వ కర్త భోక్త సత్యమిదియె
91
గోప్యమేమిలేదు గోవిందనామమ్ము
ముక్తినిచ్చుతాను భక్తులకిల
భక్తికన్నవేరు ముక్తిలేదుధరలో
సూక్ష మిదియె యిదియె మోక్షపధము
90
క్షేత్రపాలకుండు క్షేమమ్మునివ్వంగ
భక్తకోటియిలన భద్రమవ్వు
గాచుచుంటివీవు గరళకంఠానన్ను
నిన్నువిడచినేను నిలువలేను
89
నిబ్బరముగనిలచి నిజమునుచాటెదన్
భయమువీడినేను భక్తితోడ
నాదుగురువుతాను నాగభూషణుడున్, అ
భవుడు అపరిమితుడు భవభయదరి
88
శ్రావ్యముగను సాగు సంకీర్తనా తరం
గములు శంకరుని పొగడుచు తాము
పారవశ్యమొంది పరమేశ్వరుని చెంత
భక్త శ్రేణి పొందు ముక్తితాము
87
రాజశేఖరుండు రమణీహృదయతంత్రి
రాక్షసాంతకుండు రక్షమనకు
భక్తవరదమూర్తి భయవిదూరహరుడు
ప్రేమమూర్తిమనకు ప్రియగురుండు
86
ఏమినీదుమహిమ ఈశ్వరా ధరలోన
పొల్లువ్యర్ధముగను పోదు ఎపుడు
పొందికగనుకదులు పొంగెడినదులన్ని
సంఘమించతాము సంద్రమందు
85
భవతిమిరముబాపు భవతారకుడుమీరు
ఆదిగురువుమీరు అభయవరద
భక్తకోటికిలన భావగమ్యముమీరు
నాదుభాగ్యకర్త నమము మీకు
84
దర్శనమ్మునిచ్చి దయగదిశనుమార్చి
జీవితమ్మునిచ్చు శివుడుమీరు
పరమశివుడుమీరు పలుజన్మలంగూల్చు
ముక్తిదాతమీరు ముదముమీరు
83
శక్తినిచ్చుమీరు ;శ్రద్దను పెంచేరు;
భక్తినిచ్చుమీరు; భయమువీడ
మనుచు బోధ నిచ్చి మమ్ముల గాచేరు
బాధ నుండి; నమము భవభయహర
82
పరధులవియెలేవు పరమేశ్వరు కృపకు
ధర్మమునిలిపేను దయగతాను
ప్రాణవల్లభుండు ప్రాణికోటికితాను
ఉనికినిలుపునెపుడు ఉన్నతముగ
81
అమ్మగానుపంచు అమృతమునుమీరు
అయ్యగానుమీరు అద్భుతమ్ము
సఖునిగానుమీరు సౌఖ్యము నెరిపేరు
గురువుగానుగరిమ గూర్చు మీరు
80
నాహృదయమునందు నాగురుపదపద్మ
లుండు, వెరపు నాకు లోకమందు
లేదు నిమిష మైన; లింగరూప శివుడు
నాదు గురువు; తాను నాకమిలన
79
నమమునీకుతండ్రి నాగేంద్రభూషణా
నిన్నునమ్మువారి నెమ్మినీవు
నన్నుచేరినావు నాజీవ గమ్యమా
నాదు శోక నాశ నాదు రక్ష
78
ఆత్మగురువుమీరు అన్నిటామీరేను
అంబ మీరు నాదు అయ్య మీరు
అలవికానివేళ ఆదుకొందురునన్ను
అలుక వడరు మీరు అండ మీరు
77
ఏమిభాగ్యమమ్మ ఈశ్వరుండేబల్కె
అంబనిన్నుగాచు అన్నిట అని
లోకములనుగాచు లోకేశ్వరుని ప్రేమ
యింత అనిపలుకుట ఎంత మాట?
76
పదములవియె దొర్లు పరమశివునిదయన్
శ్వాస తాను ఆడు స్వామి ఆనె!
జీవ యాత్ర సాగు శివుని లీలగధరన్
తరచి గాంచిన మది ధన్యమవును
75
పాదపద్మములవి పాపపంకిలమును
కడుగు మహిమ తోడ కరుణ తోడ
కమల నయన ములవి కాంతిని పంచేను
మన్ననలివినావి మంగళాంగ
74
శస్త్ర అస్త్ర ములను సాంబుడుపహరింప
రణముమానిజనులు రంజిలవలె
ఈమనవినితాను ఈశ్వరు మన్నింప
సంతసిలవలెధర శాంతి తోడ
73
నమములివియెతండ్రి నాగభూషణహరా
నమములివియెతండ్రి నందివాహ
నన్ను బ్రోవుచున్న నాగేశ్వరా నమో
శరణు శరణు శరణు సాంబసదయ
72
కాలభైరవుండు కామిత ఫలదుండు
భక్తజనులపాలి భవహరుండు
తాపవారకుండు తాపస వరదుండు
దైత్యదమననాశి దయకుపేరు
71
ఏమిరాయగలను ఈశ్వరా ఈరోజు
బ్రతుకు బండి సాగె బరువుగాను
రామదర్శనమ్ము రంజిలగను యిచ్చి
బరువుదీర్చినావు బహుసులువుగ
70
కాలభైరవా సకలశుభంకర దేవ
ప్రణతి క్షేత్ర పాల ప్రణతితండ్రి
భక్తపోషకా అభయవరశుభకరా
కాలచక్రగమన కాలకాల
69
నిన్నునమ్మువారి నిజపారిజాతమా
నన్నుగాచుచున్న నాగభూష
అమితకరుణనీది ఆనంద ఈశ్వరా
ధన్యమయ్యెజన్మ తండ్రినాది
68
మరువనీకునన్ను మమదేవదేవేశ
నీదుపాదమహిమ నీదుదయను
ఏమరిచినగూడ ఈశ్వరా నీవుండు
ననువదలకనెపుడు నాదుతండ్రి
67
కలిమిలేములందు కష్టసుఖములందు
నీదుపాదములను నేనువీడ
అన్నికాలములవి అద్భుతమగునీదు
లీలలేను నాదు లింగరూప
66
పరమశివునిఆట పదికాలములుసాగు
పాత్రలన్నిటతను పరిమళించు
రంగముతను చూచు రసికసభయుతానె
అన్నిటుండు గాని అచ్యుతుండు
65
బహుళరూపుడాడు బ్రహ్మాండనాటక
మ్మిదియె ; పాత్ర లందు మెరయు శివుడు
కొంత తడవు నేడ్చు కొంత తడవు నవ్వు
రక్తి కట్ట కడకు రంగమందు
64
ఒంటరిగనులేము ఒక్కక్షణముకూడ
శివుడుకూడియుండు శ్రేయమిడుతు
పాపపుణ్యములవి పరమాత్ముడివిలన
తెలసిమనుటసుఖము ధీరులార
63
కడుపునిండకూడు కంటినిండానిద్ర
కాసులుపదివేలు కావెలనిల
నిలుచుటకొకనెలవు నెమ్మిగ మిత్రులు
అన్నిటినితనిచ్చు అభవుదయగ
62
జీవితమదిసాగు జీవేశ్వర కృపగ
స్థిరముగానుయుండు చింతవడక
జరుగుదెల్లశుభమె జాగృతి యిదియేను
సేయుమేలు ఎపుడు శివుడు తాను
61
ఎన్నిలక్షలిచ్చి ఈశునికిమనము
ప్రాణములుగొనితిమి? ప్రాణమువెల
కట్టలేనికలిమి; కాలేశ్వరుడుగాచు
పెన్నిధి;పరమశివుని పెద్దకరుణ
60
నన్ను గాచు నాదు నాగభూషణు దేవ
నమము నీకు తండ్రి నంది వాహ
నీవు కలవు లోన నీవెబాహ్యము లోన
నీవెసర్వము ప్రభు నీలకంఠ
59
పద్యములివికావు పదధూళులివినాదు
పరమశివునివి నను పల్లవింప
మనసునందువెలయు మన భవుడు, హరుడు
పరమసత్యమిదియెపావనముగ
58
లోన గలడు శివుడు లోపమ్ములవిమాయె
గాంచినతరచి అవి కల్లలగును
ఒరుల యందు శివుని ఓరిమి గగనినన్
యిహము నందె పరము, ఈశ్వర కృప
తిరుమలేశాహరీ తిమిరాంతకదేవ
శ్రీచిద్విలాసా విశిష్ట కృపవు
ఆపన్న రక్షకా ఆనంద హేతువా
కరుణాంతరంగమా కమలనయన
వేయినామాలు నీవేను వేంకటపతీ
వేయిలోకాలకు విభుడవునువు
వేయిరీతులనిను వేడవచ్చును ప్రభో
వేలభక్తులు నీకువేంకటేశ
అందరికిదిక్కునీవేను అవనిలోన
నీదునామము మ్రోగును నింగిదాటి
నాదు క్షేమము నీవేను నాగశయన
తిరుమలసదనా లక్ష్మీపతీ శరణము
57
నీవునిండిన హృది నిత్యనిర్మలమౌను
నీవునిండిన మది నిండు కుండ
నీవెదిక్కువనుచు నీవేకలవనుచు
నిలకడగను యున్న నిత్యముక్తి
56
నాదు ఆత్మగురువు నాలోన శివమూర్తి
నాకరమునునడుపు నందివాహ
నన్ను నాకు జూపు నాఆత్మ నాయకా
నీవెకలవు స్వామి నిజము యిదియె
55
అమ్మవయ్యనీవు ఆనందదాయకా
నిఖిలజనులకెల్ల నెమ్మినీవు
నన్నుగాచుచున్న నాగభూషణువీవు
యిహపరములనొసగు ఈశ్వరునివి
54
మనసు స్మరణ జేసి మన్మధ దహనుడిన్
సంఘమించునదియె సాంబశివుని
ఉన్నశివునిగాంచి ఉద్దరింపబడి లో
మాయతెరలువీడ మమతహెచ్చు
53
పరమశివునిఘనత మనసుతెల్వగలేదు
స్మరణజేసిన మది సంగమించు
నీరుతానెరుగదు నీలిమేఘపుటెత్తు
ఉదకముఎరుగదిల ఉదధిలోతు
52
బయట శివుని వెతుక బ్రతుకది సరిపోదు
లోన పరము కలదు లోకులకును
శివుని వెతుకు లోన శీఘ్రపధమ్మది
పరమశివుడెచూపు పరమపదము
51
పరమశివుడుమనకు పరమదైవముతాను
ఉన్న నిజము తాను, ఉనికి తాను
సత్యమెరుగదల్చి సాంబశివునిదల్చు
మనసులోననీవు మైమరచుతు
46
అంతటావెలసిన అభవునికి అభయ
వరదునికివి నాదు వందనములు
నాదుదేహమందు నందము నిలిపేటి
పరమశివపదముకు ప్రార్ధనలివి
47
కలవు నీవు ఎపుడు కలవునీవంతటా
కలవు కలవు కలవు కాలకాల
నీవులేనినెలవు నీవుకాని అణువు
లేనెలేవుతండ్రి లింగరూప
48
అన్నిదేహములకు ఆదేశముశివుడు
చలనమునకుకర్త చంద్రమౌళి
శాంతచిత్తమునిడు సాక్షిభూతముతాను
తానె ఆత్మ మనకు తధ్యముగను
49
అణువణువునయుండు అద్భుతమ్ము శివుడు
ప్రతిపదార్ధమందు పరిఢిలుతను
కర్త కర్మ మరియు కర్తువుయు తానేను
పాము కాదు ,జగము పరమ శివుడె
50
గురువు దెల్పు మనకు కూరిమి తోడనీ
రజ్జుసర్పభ్రాంతి రాజిలి తను
భయముపోయిమనము భైరవులవుతాము
యిక్కటులవిబోవు యిహముమందు
45
అన్నిరూపములన అన్ని అవస్థలన్
అంతటావెలయును ఆశివుండు
రూపబేధముండు లోకమ్మునందునన్
గాని,శివుడె కలడు ఖచ్చితముగ
43
పనులుసాగకున్న పరమేశ్వరు కృపయేను
పనులుసాగిన అది పరమ దయయె
పనినిసేయుట మన పరమకర్తవ్యము
ఫలితములవి శివుని ఫలమెపుడును
44
అలవికాకనేను అలమటించెడివేళ
అండనీయితండ్రి అమితకరుణ
నీవు అండ గాను నిత్యము నిలిచేవు
అదిమరచిమసలుటె అసలుమాయ
42
గురు కృపనుగనుచు గురువాక్కు వినుచునూ
మనుగడతనుసాగ మాయలేక
మనసుశాంతినొందు మాధవు నిలయమై
శాశ్వతముగనిలచు సంపదగను
43
ఉన్న ఉనికి ఒకటె ఉన్నతోన్నతముగా
గూడునుధరలోన కూరిమిగను
పరమశివుడుతాను పధికుడైనాడుగా
జీవపయనమందు స్థిరముగాను
39
తారలాకసమునతళుకుచునుండును
శోభనిత్తువునువు సోమునికిని
దినకరుడుతను ప్రతి దినముదయించును
అంతరిక్షమదియె అద్భుతమ్ము
40
ప్రాణకోటియిలన పరిఢిల్లు క్రమముగా
ప్రకృతినియముముల ప్రతిభ యిదియె
యిన్నిటినమరతువు ఈశ్వరాసతతము
ఎంత గరిమ నీకు ఎంత కరుణ
41
ఇంతకరుణతోడ యిలనునిలుపుదువు
మమ్మునడుపుచున్న మాదుదేవ
గళమువిప్పిపాడ గరళకంఠా అనీ
చాలునాపదములు శ్యామలంగ?
38
ఎట్టిమాయ అయిన ఎంతవరకునిల్వు
గురువువాక్కు మరువకుండ బ్రతుక
పరమశివునికరుణ పరుగులెత్తు మనకై
గురువుమహిమమనము గురుతెరిగిన
37
కానబడదుగజము కంటికున్ననుగంత
ఎందరున్ననుగద ;ఈశ్వరుదయ
గూడఆవిధముగ కొంతగా గనబడు
కఠినకాలమందు; కాలమాయ
36
శక్తినీవుతండ్రి సాంబశివానాకు
తలపునీదిచాలు దాటభవము
నీదుమహిమమరువ నిత్యము శంకరా
నీవునాఉనికివి నిజము ఇదియె
35
తనువుకాదుమనము తనువును ధరియించు
తత్వచోదకులము; తలపు కాదు
మనసు కాదు; అరయు మాధవుసంతతి
మనము;తాకలేదు మాయ మనను
34
క్రుంగియున్న క్షణము కోపము వచ్చేను
ప్రేమపంచువారి ప్రేమమీద
కొంతతరచిచూడ క్రొత్తకోణమువచ్చు
మనసుశాంతినొంది మమతహెచ్చు
32
అన్నపూర్ణనీదు అర్ధభాగముతండ్రి
జీవకోటిలోని చేవనీవు
ఎన్నిహంగులనువు ఈశ్వరావెలిసేవు
వివిధరూపవర్ణ విశ్వనాధ
33
కన్నతల్లితాను కారుణ్యమునుజూపు
పెంచుతానుతండ్రి ప్రేమతోడ
కూరిమినిలపంచు గూడి మిత్రులుతాము
ఈశ్వరుడుతన కృప యిటుల తెలుపు
31
చింతవడకునీవు చేజారిన క్షణము
కొరకు వేచి యుండు క్రొత్త దిశన
భయములేలమనకు భగవంతుడు నడుపు
కాలచక్రమునిల కరుణ తోడ
30
గురుతెరిగిమసలుము గురువాక్కునెపుడును
సర్వకాలమందు శాంతితోడ
ఆగనీయకునువు ఆనందయోగము
మనసునందునింపు మాధవుడిని
29
కలిమిలేమిలందు కైలాసపతితాను
మనకుతోడుగాను మసలుచుండు
కష్ఠమనితలచకు కన్నీరు వెట్టకు
కలతలందునీవు గనుముశివుని
28
కలడుశివుడుతాను: కణకణమందుండి
నిన్నునన్నుమ్రోయు నిజముగాను
కష్టసుఖములిలన కలకాల ముండవున్
నిలుచుయుండునెపుడు నీలకంఠు
28
కలడుశివుడుతాను కణకణమందుండి
నిన్నునన్నుమ్రోయు నిజముగాను
కష్టసుఖములిలన కలకాల ముండవున్
నిలుచుయుండునెపుడు నీలకంఠు
27
పరమశివుడులేని ప్రాంతము లేదిలన్
పరమశివుడుకాని ప్రాణిలేడు
వ్యక్తమైననేమి వ్యక్తమవ్వకనేమి
ఉన్నసత్యమొకటె ఉనికిఒకటె
26
పరమశివుడుతాను ప్రతి అణువునయున్న
పరమసత్యమనుచు పరవశించు
తలచుముశివపదము తప్పక హృదయమా
క్లిష్థసమయమందు క్లేశవడక
25
బ్రతికియున్నవేళ భగవంతునిదయగ
కదలవలెనుకలము కాలకాలు
కరమునన్నుకదుప కాయము కావలె
పరమశివనిలయము ప్రతినిమిషము
24
ప్రమధగణవిభుండు ప్రహ్లాదవరదుండు
అవనినుద్దరించ అవతరించె
సాంబశివుడుతాను సత్యయుగమునకై
తెరనుదీయవచ్చె దిశనుమార్చ
23
గరుడగామినీవు గరళకంఠుడవీవు
భక్తజనులపాలి భవతరినువు
నింగినున్నసురలు నేలమీదనరులు
నీకుదాసులయ్య నిర్మలాంగ
22
పరమశివుడుగురువు పరమాత్మరూపుండు
పరమపదముగురువు పాపహరుడు
పరమశుభకరుండు పరమదయామూర్తి
పరమవరముగురువు పరమరక్ష
21
అవనిజనులకివ్వ ఆనందజాగృతి
అవతరించుగురువు అవధరింప
శరణువేడువారి చంద్రశేఖరమూర్తి
కరుణతోడగాంచు గరళకంఠు
20
ఈవిధముగనుండు ఈశ్వరునికరుణ;
కూరిమికలిగించి గూర్చుకలిమి
భక్తినివెలిగించి బ్రతుకును పండించు
గమ్యమునకుజేర్చు గరిమనిచ్చు
19
గురువుతానుధరన గురుతుచేయుమనలో
యున్నదైవగుణము యుక్తితోడ
దానవగుణములను దరిచేరనీయక
యిహపరములుగూర్చు ఈశ్వరుండు
18
పాదవందనమ్ము పరమశివానీకు
పిలిచినపలికేటి పెద్దదిక్కు
అడుగుమనసునిన్ను ఆద్రముగనుతండ్రి
నీదరినిలతాను నెమ్మదింప
17
శక్తినీవుతండ్రి శంకరా భైరవా
జీవశక్తినీవు స్థిరముగాను
నీవులేక ఉనికి నిజముగాలేదు నీ
వణువణువునయున్న పరము తండ్రి
16
మంచుకొండమీద మన్మదదహనుండు
నర్తనమ్ముసేయునందముగను
చిత్రముగనుతాను చింతలు మోసేటి
మనిషిగానుమారు మాయచేత
15
గురువుబోధసేత గురుతెరుగునుతన
స్వస్వరూపమహిమ స్వయముగాను
మనుగడిలనమారు మధురముగను తను
గురువువాక్కునగలకూరిమివల
14
పరమశివుడుతాను పరవశించుసతము
ప్రకృతితనుగనయి పరిమళించి
కనులుమాయతెరన గాంచువివిధతత్వ
ములను గాని , ఉన్న మూలమొకటె
13
వివిధదేహకర్మ వివిధభావములతో
వివిధలీలల నువవిచ్చినుడవు
లోకమందువెలయు రూపములన్నిటా
చేతననువు స్వామి చిరము గాను
12
ఆప్తబందువునువు ఆపన్న వారకా
ఆది శక్తి నీవు అందరకిల
ఆదుకొందువునువు అన్నివేళలయందు
భక్త హృదయ వాస భక్త పాల
ప్రణమామిరాఘవా పరమార్థదాయకా
ఆత్మప్రదీపకా శాంతమూర్తి
దాశరధీనమో దశకంఠమర్ధనా
కౌసల్యతనయా నిగమ సుసేవ్య
శ్రీరామ గుణధామ శ్రీరామ రణభీమ
శ్రీరామ మునికామ శ్రీకృపాబ్ది
శ్రీరామ శ్రీప్రదా శిరసానమామిత్వం
రామాదయాసాగరా శరణము
రామనామముదాటించు రాగజలది
రామబాణముగాచేను ప్రాణమెపుడు
రామవాక్కుతావేదమై రాజిలునిల
రామపధముముక్తిపదమై రమ్మనునను
11
ఆదిపూజనీకు ఆదిశంకరదేవ
ఆత్మతత్వమునువు ఆర్తబందు
కష్టసుఖములందు కాలములన్నిటన్
నీవెనాకు అండ నీలకంఠ
10
ఆసుతోషుడివిల అద్వైతబోధకా
అమితకరుణనీవు అండనీవు
సత్యతత్వనిలయ సాంబసదాశివా
వందనమ్ముతండ్రి వైద్యనాధ
9
హరిహరస్వరూప, ఆనందసంభవా
లోకములకురక్షరోగహర్త
నిన్నునమ్మువారునిత్యమునిలిచేరు
సుఖముగధరలోన శోభనాంగ
8
సుందర వదనా సుశోభిత గాత్రా వి
వేక వర్ధనా వివిధ సుఫలద
ప్రణతులు గురువర్య ప్రమధగణాధిపా
భైరవా అభవ అభయ శుభ కర
7
కనుల తోడ గాంచి కాలభైరవ స్వామి
నయనదీక్షనిచ్చె నయముమీర
స్థిరము గనయె భక్తి జీవితంబందునన్
ముక్తివేరులేదు మోక్షమిదియె
6
కల్ల కాదు నిజము కైలాస నాధుడే
నిత్య గురువు ఆయె నిజము నిలుప
మనను ఉద్దరింప మన కొరకు పిలిచె
శరణు వేడు దాము జాగులేక
5
కల్మషముల బాపు కల్యాణ వరగాత్ర
కలిమి నీవె తండ్రి కమల నయన
నిన్ను నమ్ము వారు నిజముగా తెలిసేరు
నీదు నామ మహిమ నీలకంఠ
4.పరమశివుడుమీరు పరమాత్మమీరేను
పరమపదముమీదు పదయుగళము
పరమశాంతినిచ్చి పరముక్తినొసగేటి
వరముమీదుపదము వరదమూర్తి
3.అద్భుతమ్ముమీరు అమరవంద్యులుమీరు
అన్నపూర్ణమీరు ఆర్తరక్ష
అమితకరుణమీరు అరుణచలేశ్వరా
ఆగమాదిసేవ్య అగ్రగణ్య
2.నన్ను నడపు మీరు నాదు దైవము మీరు
నాకు వెల్గు జూపు నాయకుండు
నందము నిల నిల్పు నటరాజు మీరేను
నన్ను నాకు దెల్పు నాదుగురువు
1.ఆత్మగురువుమీరు అగ్రపూజ్యులుమీరు
అండనిచ్చువేళ అంబ మీరు
అంగరక్షమీరు ఆదిదైవముమీరు
ఆత్మబలిమిమీరు అవనిలోన
పన్నగ శయనా అపారకృపావరా
వైకుంఠవాసదేవ సుర వంద్య
వేంకట నాయకా వేదవినుతపదా
నిగమాగమనిలయా నిర్మలాంగ
వేయి నామాలు వేవేలు నీ నెలవులు
తిరుమల రాయడా దెల్పు దిశను
ఆనంద వైభవా అమితకరుణవీవు
ఆపన్న రక్షకా ఆర్త త్రాణ
విశ్వ వ్యాపక చైతన్య విధివినీవు
మమ్ము నడిపెడి జగదేక మార్గదర్శి
ఆత్మ చోదక శక్తివి ఆదిదేవ
చింతలే మాయయిలలోన చిత్తచోర
ఘోరపాపాంతక గురుచరణము జ్ఞాన
వితరణము వివేక వినయ ప్రదము
మోదకారకమిల మోక్షదాయకము అ
జ్ఞానవారకము విజ్ఞాన ప్రదము
వేదమంత్రాంది సేవితము దివ్యపదము
విషయవినిర్మూల విజయ ప్రదము
శ్రీగురుపాదము శ్రితపారిజాతమ్ము
తాపత్రయనివార ధర్మ ప్రదము
జయము సద్గురు దేవా విజయము నీకు
శరణమో సత్య రూపమా శరణు శరణు
ప్రణతి సద్గతి దాయకా ప్రణతి ప్రణతి
వందనమ్ముసర్వేశ్వరావందనమ్ము
శ్రీరామునిదయసే సీతమ్మవరముగా
వర్ధిల్లవలెబాబు వాక్కుతోడ
నిండు నూరేళ్లు కన్నీరులూ కలతలూ
లేక హాయిగొనుచూ లెస్సగాను
ఆరోగ్య భాగ్యమ్ము ఆనంద తత్వమూ
స్వంతమవ్వగ సదా శాంతి తోడ
ఆటపాటలునేర్చి అలరవలెను బాబు
భక్తినెరవుచును భయము లేక
చిన్నవాడుతాను చీకాకులు వడకా
మనగవలెనుమంచి మనసు తోడ
కూరిమిగనుమారి గూర్చవలెనుసంత
సమ్ము; కన్న నాకు స్వప్నమిదియె
శరణము శాంభవీ శరణము శివసతీ
శరణము ఈశ్వరీ శంభురాణి
శరణము భార్ఘవీ శరణము శాంకరీ
శరణము పరమేష్టి శాంతమూర్తి
శరణ భవతరణీ శరణు భవానీ వి
జయవర వితరణీ జయముదుర్గ
సర్వశక్తిప్రదా సర్వరక్షాకరీ
శరణు శుభప్రదా శరణు శరణు
వందనమ్ములమ్మ వామదేవప్రియా
నమమునీకుతల్లి నందముగను
నిన్నునమ్మితిజననీ నీవె దిక్కువు
అండనీవుతల్లి అమరవంద్య
నూతనవర్షమునూతనోత్సాహమై
నూతనోన్నతిమీరునొందవలెను
నవ్యకాంతుప్పొంగ నటనమాడవలెను
సకలశుభములతో సంతసముగ
కలలుసాకారమై కళ్యాణములొనర్చ
పర్వమవ్వవలెను పయనమిలన
పరమశివుడుతాను పరమసౌఖ్యమునివ్వ
వరసంపదలతోడ వర్ధిలవలె
కాలచక్రముతిరిగెను క్రమముతోడ
జీవనముసాగగధరనచిరముగాను
రమ్యరసభరితముగాను రాజిలవలె
సకలజనులుసంవృద్ధిగ శాంతితోడ
భరతాగ్రజా రామ భగవత్స్వరూపమా
ధర్మవినిర్ణేత దశరధసుత
లక్ష్మణసంసేవ్య లక్ష్యనిర్దేశకా
కౌసల్యతనయా వికల్పరహిత
సీతాపతీ విభో శ్రీశేష శయనా వి
నిర్మలాంతర్గతా నీరజాక్ష
మారుతీ తపమా తమస్సుహరించెడి
మమమోక్ష దాయకా మందగమన
కనికరమువునీవు కైవల్యదాయకా
కమలదళనయన సకలశుభకర
క్రూరజనవిదూర క్రోధవినాశకా
కానబడుముతండ్రి కరుణతోడ
మాటలుకొదవాయెవిభో
పాటికపడలేను స్వామి పదముల కడకిన్
సూటిగరప్పించుకొనుము
ఆటలునామదివివలదు ఆనందేశా
చెప్పనలవిగాదుమదికి
తెప్పలుగనుకోరికలిలతిరుమల వాసా
రెప్పలుమూయుమువాటికి
రప్పించుకొనుమునువునను రయ్యన స్వామీ
పార్ధసారధినీవు పరమాత్మనీవేను
భూభారమునుమోయు భూరికరుణ
వంశీధరా కృష్ణ వాసుదేవా హరీ
గోలోక రక్షకా కూరిమినువు
రాధాసమేతా విరాగ రాగాతీత
ఆనంద నర్తనౌ అమిత మహిమ
శ్రీకృష్ణ గోపాల శ్రేయోవివర్ధనా
లోకశోకవినాశ లోకకర్త
సర్వజీవేశ్వరాపాహిసర్వఫలద
నమము గీతాప్రబోధకా నమము తండ్రి
త్యాగరాజేశ్వరా నమో యాగభోక్త
ప్రణతి జీవనసారధీ ప్రణతి ప్రణతి
గణపతి యనుఒక బాపడు
పణములు సమకూర్చెనుసుత పరిణయమునకై
రుణములు స్నేహితు లివ్వగ
గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
గణపతి సాధకుండతడు కాళికి పూజలు సేయుభక్తుడున్
గణపతి కూతురౌసరళ కమ్మనిగాత్రము గల్గియున్నదిన్
గణపతి అగ్నిహోత్రమును గైకొన వేడగ వైదికమ్ముగన్
గణపతి పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్
నీవొసంగినకానుకలనునీకేఅర్పించుటనైవేద్యము
నీవొసంగినహృదయమునునీకేఅర్పించుటప్రార్ధన
నీవొసంగినప్రాణమునునీకేఅర్పించుటధ్యానము
నీవొసంగినచైతన్యమునీకేఅర్పించుటసమాధి
నీవేఉన్నావుయనుటపరమాద్వైతము
విఘ్నవినాశకా విజయప్రదాయకా
నాగోపవేతుడా నమము తండ్రి
లంబోదరా నమో లావణ్యవరగాత్ర
ఏకదంతా పాహి ఈశపుత్ర
శూర్పకర్ణా వర స్తోత్రియ నిష్ఠాగ
రిష్ఠా నమామి సురేశవినుత
మూషికవాహనా మోకరిల్లుదువిభో
పార్వతీతనయా అపారకరుణ
శివగణాధిపా ప్రణమామి శ్రితజనపరి
పాలకా ఆత్మ కారకా పాహిపాహి
సర్వ దేవదేవేశ్వరా సర్వ శ్రేష్ఠ
వంద నము సర్వదాస్వామి వందనమ్ము
జయజానకీపతీ జయజగదోద్దార
జయ యినకులదీప జయము జయము
ప్రణమామి శ్రీరామ రఘువంశ వర్ధనా
సౌమిత్రి సంసేవ్య సత్యసంధ
దశరధ నందమా దశముఖ మర్ధనా
దానవాంతక రామ తాపహారి
శ్రీరంగ రంగా విశేషకృపావరా
రామాదయాసార రణవిజేత
రాక్షసులనుగూల్చ రామబాణముమేలు
రామబంటుచాలు లంకగాల్చ
రాగజలధిదాట రామనామముజాలు
కలతలన్నిదీర్చు కరుణతోడ
దౌర్జన్యమాపుమా దౌర్భాగ్యనాశకా
దుర్జనులకునీయుదుర్బలతను
దయగొనిసతతము ధర్మమార్గమునందు
మానవతోనడ్చు మనసునిమ్ము
ప్రతిమనిషికినీవు ప్రత్యక్ష్యదైవమై
కరుణతోకదిలెడి కరములిమ్ము
గోమాతకీయుమో గోకులవర్ధనా
రక్షణ పోషణ రాక్షసాంత
ఎండుగడ్డితినెడిగోవు ఏమి ఎరుగు?
నిండు ప్రాణముగోవుది నిలుపదగును
తిండి కేమికొదువలేదు ధేను వధను
రూపు మాపదగుమనిషి లోకమందు
శరణమ్ము శాంభవీ జననీజగన్మాత
భారము భరియించు భవభయతరి
భార్ఘవీ భైరవీ భక్తిగమ్యా నమో
ప్రాణేశ్వరీపాహి ప్రణవనాద
నాగభూషణురాణి నాదుహృదయతంత్రి
మీటుచుంటివినీవు మిన్నగాను
మమ్ముగావుచుయున్న మాయమ్మనీవమ్మ
విశ్వంభరానమో వేదవినుత
సకలశుభవరవితరణాసర్వపూజ్య
సద్గతులనిచ్చుసదయా విషయవిదూర
సర్వమంగళ శ్రీకరీ సన్నుతాంగి
శంకరసతీఉమా నమో సహనశీల
శారదేపాహిమాం శరణమోభగవతీ
వరదాయినీనీకు వందనములు
ధవళ వస్త్రాన్వితా తల్లీ నమో నమో
ప్రణమామి వాగ్దేవి పదములకడ
కమలనేత్ర్రీనీయి కరుణామృతము మాకు
సతతము దయగొను సత్యవాణి
ప్రణతివీణాపాణి ప్రార్ధనా గమ్యమా
అజ్ఞానమునుబాపి ఆదుకొనుము
నమము విద్యాప్రదాయినీ నమ్రతగను
సకల సౌజన్య ములనీయు శాంతినీవు
ధ్యాన యజ్ఞము నందున ధన్యతనియి
సత్వ చిత్తము నీయుమా శక్తితోడ
Comments
Post a Comment