Introduction: Gratitude to Parents and Devataa Praardhanalu
కడు ప్రేమగ పెంచిరి మము
యడుగకనే యిచ్చిరన్ని, ఆప్యాయముగన్!
నడ యాడితిమి సుఖంబుగ
నిడెహరి జననీ జనకుల నే పుణ్యమునో!
శ్రీకృష్ణా! నీ లీలలు
నీకృప చే యందముగను నే రాయ వలెన్
ఓ కరుణా మందారా!
నీ కోమల పాదములకు నే కైమోడ్తున్
మిక్కిలి ప్రీతిగ మ్రొక్కులు,
అక్కరతీర్చి వరములిడు అవ్యక్తునికిన్,
మక్కువగ మాధవుండను
యక్కున దలిచెడి హరునికి, యంబాపతికిన్
సన్నుతి నీకు విధాతా!
పన్నగ శయనోద్భవా!కమలజా!దేవా!
వన్నెల వాగ్దేవీ పతి
మిన్నగ మన్ననగ జేతువీ లోకంబున్
దండంబులు విఘ్ణేశుకి
యండగ నిలిచెడి ప్రభువుకు,యంబాసుతుకిన్
ఉండ్రములు మెండుగ, కడుపు
నిండుగ నుభుజించి గాచు దివ్యాంగునికిన్
జయ హారతులు భగవతీ!
దయతో బ్రోచెడి చదువుల తల్లివి! వాణీ!
నియతిగ కొలుతుము మాతా!
నయముగ మమ్ములను జూడు,నళినదళాక్షీ!
వేదంబులు నీకు నెలవు
కాదంబరివి నినుకొలుతు,కావ్యరవములన్!
మోదంబుల నీయుమెపుడు
ఖేదంబును రూపుమాపి కృపతో వాణీ!
తెల్లని కాంతుల బంగరు
తల్లివి, బ్రోతువు,జగమును,దయతో నీవున్
అల్లవలె పద్యముల నే
నల్లని వానికధ దీవెన లిడుము దేవీ!
గణముల లెక్కలు క్రొత్తవి
గుణములు చక్కంబడినవి కొన్నే,యయినన్
అణకువగ నేనడుగుదు,క
రుణతో నీవు పదముల నిలుచు కల్యాణీ!
శ్రీమాతా! జగదంబా!
నామామృత మధురసంబు నెడదలునింపన్
నే మాధవు లీలలు కడు
ప్రేమాసక్తిగ,లిఖింప,వెరపిడు మమ్మా !
సిరులిడు లచ్చివి, నీవే
మఱుకీయుము భక్తిని హరి పదముల జేరన్
హరి విసిగిననూ నువుగను
కరుణగ,భక్తుల కిలనువు కలిమివి జననీ!
Introduction: Intent behind writing KrShna katha
డబ్బులు గావెల నందుము
అబ్బుర పడుచును గొనెదము యాడంబరముల్
అబ్బా! యనవలదు తుదకు
దబ్బున ముగిసిన ధనాశ, ధరలో మేలున్!
భవ తాపంబు లనిల మెల
కువ దీర్చెడి రామనామ కోటికి నమముల్
భువిజనుల పాలి వరము,సు
లువగును పధము, హరిపదములు వడిగ జేరన్
తుది మొదలు లేని హరికధ
నిధనించును ఖ్లేసము, కరుణించును ముక్తిన్
విధిగ విని కొంత జదివిన,
ముదమును చేగూర్చు గొప్ప, పుణ్యము గలుగున్!
ఎందరు వ్రాసిన,నందరు
పొందిరి హరి చరణములను పొందిక మీరన్!
అందముగ వ్రాతు,నిక భవ
బంధములను త్రుంచగల్గు,మాధవు చరితన్!
నిత్యము పూజలు జేయుచు
సత్యంబు దయల నడిచెడి సథ్హృదయులకున్
ప్రత్యేకము భాగవతము
యత్యల్ప శ్రమతోడ హరిని యందుటకు యిలన్!
సుకముఖతః హరి చరితము
సకల శుభంబులను గూర్చె, సల్లాపముగన్
వికసించు నుహృదులు వినిన
ముకుళిత హస్తముల, వ్యాస వృత్తాంతములన్
ఆడిన మాటను తప్పని
వాడు,ధిటవగు పితృవాక్య పరిపా లకుడున్
ఓడక నిలచును రాముడు
దోడుగ, దీనజనులకును, దొర! ఘనుడిలన్!
ధరణిజ తోదర్శనమి
చ్చె రఘుకుల తిలకుడు కవికి,జేసెను తపమున్
కరముల నిడిహలమును ,శ్రీ
హరికిని? శివునికి జపమిడి, హరిరూపుగనెన్
అందాల జంట గని భవ
బంధము లను త్రుంచు గొనగ, బమ్మెర రాజున్
నందము గను కృష్ణ కథా
గ్రంధమును తెలుగున నుడివె, కల్యాణముగన్
అతి రమ్యంబుగ పోతన
శృతి సారంబును తెలుగున సులువుగ దెలిపెన్
హితముల నిడు కృష్ణకథ య
నితరంబుగ వ్రాసి హరికి నిచ్చి తరించెన్
తానొందె ముక్తి పోతన
ఆ,నంద కొమరుకధనిడి,ఆంధ్ర జనులకున్!
ఆనందమ్ము గ నాకధ
నేనందింతు, గలిగింప నిహపరసుఖముల్!
చదువుచు పోతన నుడివిన
మధురంబగు భాగవతము, వ్రాయుదు మరినే
నదియే స్వా ధ్యా యముగను,
తుదకు మన వెనుక నిలిచెడి దొక్క సుకర్మే !
శౌర్య ముగ పద్య రచనా
కార్య ము జేయ మొదలిడితి, గనునను శాబ్దీ!,
ఆర్యు ల భాష నెరుగ,యని
వార్య ము గను గావలె దయ, మరువకు జననీ!
Introduction: Offering at God’s feet
భక్తుల గాచును బద్దుడై కృష్ణుడు
రథమును తోలెగ రణమునందు
గోవర్ధనంబెత్తె గోకులమునుగాచె
కాళీయు మర్ధించి గాచె జనుల
నందకిశోరుడు నవనీత చోరుడు
బాలముకుందుడు మాధవుండు
పావనచరితుడు పాపవి మోచనుడు
పరమహితుండితడు పాహి యనిన
అల్లరి పనులుకడు యందము గను జేయు
పిల్లలడగ వెన్న పిలిచి నీయు
నల్లకన్నయ యిల నడుచు రేపల్లెన
చల్లలను కుడుచుచు చక్ర ధారి
కాకుత్స్థ తిలకుడు, కరుణా సాంద్రుడు
కమల దళాక్షుడు కరి వరదుడు
కంసప్రాణహరుడు కలియుగదైవము
వసుదేవ తనయుడు వామనుండు
వేదవిహారి కామేశ్వరుడు విభుడు
సుందర మూర్తి వసుధపెనిమిటి
మురళీ రవముల మురిపించు కృష్ణుడు
మేఘ శ్యాముడు హరి ప్రేమమూర్తి
భక్తితో దలచిన భయమును బాపును
సుఖములడిగిన నవి శుభము గనిడు
ముక్తి గోరు వారి మురిపెము దీర్చును
కృష్ణు డెపుడు గనును కృప దోడ
హరినీ పదములకు నిడెద
మరిమరి నీరాజనములు, మమకా రముగన్!
విరచిత పద్యపదములె క
పురముగ వెలుగును రగిల్చి మొక్కెద నీకున్!
22 avataaramulu
కలుగును ఆనందమెపుడు
తొలగును సంసార చెరలు, దూరమగు వెతల్
యిల యను నిత్యము, భక్తిని
కలహృదితొ హరి యవతార, కథలు చదివినన్
కౌమారాక్యుల సర్గము
నా మాధవుడ వతరించె నాదిగ, నాడున్
క్షేమమిడె బ్రహ్మచర్యము
చే విప్రులకు, నమమందు చిన్మయ మూర్తీ!
భువనము రసాతల మునుం
చివెలికి తీసెగద, సృస్ఠిచేయగ లోకా
ల, వరాహవతారంబున
అవనీ పతికి నమములిడె దానందముగన్
నారదునిగ జనియించెను
నారాయణుడె, తెలుపంగ నఖిల జనులకున్
తీరుగ వైష్ణవ ధర్మము
చేరువ జేసెను గముక్తి ,శీఘ్రము గనిలన్
సరసిజనాభుడు, ధర్మపు
దరి, నాలుగవయవతరణ ధర్ముని సుతులౌ
నర నారాయణులు: శుభము
ధరణికినిడె వారి ఘోర తపము, బదరినన్!
ఆసురి యను బ్రాహ్మణునికి
ఆ సిద్దేశుడు కపిలుడు, అనుశాసించెన్
ఆ సిద్దాంతమె సాంఖ్యము
దాసులకై ఐదవ యవతార వరమిలన్!
అనసూయాదేవి, మహా
ముని అత్రికి దత్తునిగ ప్రమోదమొ నొర్చెన్
వనమాలి: ఆత్మవిద్యను
ఘనులకు నేర్పగ వెలిసెను కఱివేలుపిలన్
సురల సహాయమున జగము
పరిరక్షించె హరి సప్తమ యవతరణనన్
కరివరదె యిలన యజ్ఞుం
డు, రుచికి ఆకూతికి సుతుడు, జగత్పతియున్
పరమ హంస మార్గంబును ప్రకటనమ్ము
చేసె పండితులకు హరి చిన్మయముగ
నిల ఉరుక్రమునిగను యెనిమిదవతర
నమున, మేరుదేవికి నాభి నందనునిగ
వసుధ మారె ధేనువుగను , వస్తువులను
నేర్పుగ పిదికె పృధువు ముని గణములు
వేడ, నవమయవతరన మిదిగ హరికి,
సార్వ భౌముడై గాచెను సర్వులనిల
మీనావతార ధర్మము
గా నాడు జల ప్రళయమున గాచె గదనిలన్
తాను మనువు వైవశ్వతు
నో నావన, మాధవుడు గను నెపుడు దయగన్!
పదకొండవ యవతారము
న దయాశాలి కమఠముగ నందము గొల్పెన్ ,
ముదము సురాసురల కునిడె
మధు సూదనుడు, తను మ్రోసి మందర నగమున్
కడలిన ధన్వంతరియై
వెడలె అమృతకలశహస్త వేడుక గానున్
పడిన పరిశ్రమ మరచిరి
కడకు సురాసురలు హరిని గని నంతగనే
మోహితుల సేయ అసురుల
మోహినిగను మారెకృష్ణమూర్తి, సురలకున్
మోహనముగ అమృతమునిడె,
మోహనుని కరుణ యపారమునెపుడును సుమీ!
నరసింహ రూపు విష్ణువు
ధరియించి హిరణ్యకశిపు దండించె, నిలన్
హరికి పదు నాలుగవ యవ
తరణము, ప్రహ్లాదు బ్రోచి , తారణ మిచ్చెన్
నాడు యడిగె బలిని, హరియు
మూడడుగులె వామనుడిగ, మోదము గల్గన్
మూడుజగమ్ముల ప్రాకెన్.
గూఢమెపుడువిష్ణుమహిమ, కొండంతదయన్
కరుణను చూపని రాజుల
ధరణీశుల హతముజేసె, దామో దరుడున్
ధరలో భార్గవ రాముగ,
ఇరువదినొక మారుదునిమె నిఃక్షత్త్రమవన్
వేదవ్యాసునిగ నిలన
వేదమ్ముల శాఖలుగను విభజించె గదా
ఆదేవ దేవుడు, అమిత
మాదయ, ప్రసరించునెపుడు మనయందరికై
యిక్కటలు సురలవి తొలగ
రక్కసుల దునిమెగ నిలన, రాముడు తానై
నిక్కము నాతని బాసలు,
నక్కరకును సేతు బంధనంబును జేసెన్
భూభారము నశియింపగ
శోభిల్లిరి యన్నదములు చూడ చకగిలన్
తా బాలముకుందుడయెగ
దా బలరాముడయెపెద్ద, దానవు లడచన్
జినసుతుడై తేజరిలెను
అనిరుద్ధుడు, బుద్ధునిగను, అసురాంతకుడై
అనితరముగ హరి లీలల
వనిలో, కలియుగమునాద్యవతరణ మహిలో
అవనీశులు చోరు లవగ
అవనీపతి మరల వచ్చు ఆదు కొనంగన్
అవమానపడెదరపుడును
అవనీతిపరులిల, కల్కి యసురుల యణచున్
Comments
Post a Comment